మన జీవితాలు మన నియంత్రణ తప్పి మననే కష్టపెడుతున్నా, ఆ కష్టాలపై
మన దృష్టి వెళ్ళటం లేదు, ఎందుకంటే మనము ఒక మాయా లోకంలోకి
ప్రవేశించాం కాబట్టి. ఆ లోకం లోనికి స్వయంగా మనమే వెళ్ళాము, కానీ
బయటకు వచ్చే దారి మాత్రం మనకు తెలియటం లేదు. ఒకటి కావాలి అంటే
ఇంకోటి వదులుకోవాలి అని అంటారు, అలానే, మనం ప్రవేశించిన ఆ మాయాలోకం
లో నుంచి బయటకు రావాలంటే మనము కూడా కొన్ని వదులుకోవాలి. ఇది అచ్చం
జూదం లాంటిదే. కానీ ఈ జూదం ఇతరులతో కాదు, మనతో మనకే జరిగేది. అందుకే ఆ
మిథ్యాలోకం లోనుంచి బయటకు రావాలంటే మన ప్రస్తుత మనిషిని, మనసుని,
స్వభావాన్ని పణంగా పెట్టి స్వయంజూదాన్ని ఆడితే కానీ బయటికి రాలేము.
మిథ్యాలోకములో నుంచి మిమల్ని బయటకు పంపించడం, లేదా మీరు ఉన్న లోకం
యొక్క నిజ స్వరూపాన్ని చూపటమే ఈ పుస్తక లక్షణం. అందుకే స్వయంజూదం
అనే ఈ పుస్తకం కేవలం ఒక కవితా సంపుటి కాదు, మనం మనతో పాడుకోవాల్సిన
పాటలు, మనతో మనం పలకలేక ఆపేసిన మాటలు, ఈ పుస్తకం లోని రాతలు.