బాల్యం, మరపురాని మరచిపోలేని ఒక తీయని జ్ఞాపకం. మరలా ఒక అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ అనుభవించాలి అనుకునే దశ.
ఎన్నో అనుభూతులను నిక్షిప్తం చేసుకున్న బాల్యదశ అందరికీ అన్నీ ఇవ్వదు. ఇప్పటి రోజుల్లోని పిల్లల జీవితాలను ఒక్కసారి పోల్చిచూస్తే మనం పొందినది వారు పొందలేనిది అని అనేక తేడాలు కనిపిస్తాయి. మనం చేతులతో తాకి అనుభవించిన ఆనందాలు ఇప్పటి పిల్లలకు టీవీలలోనో, పుస్తకాలలోనో కనపడుతున్నాయి.
ఎన్నో ఆశలను, ఆశయాలను జత చేయాల్సిన బాల్యదశ ఇప్పటి పిల్లలలో కొందరికి ఒక చేదు జ్ఞాపకంగా మారుతోంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పడంలో నాకు ఏ తప్పూ కనబడడం లేదు.
ఆనందంగా అమ్మానాన్నల ఒడిలో పెరగాల్సిన పిల్లలు ఒంటరిగా, అనాథలలా వీధులలో కనబడుతున్నారు. అందరూ ఉన్న మరి కొందరు ఎవరూ లేని ఏకాకిగా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగానే బ్రతకాలనుకుంటున్నారు.
మానవీయ విలువల మధ్య, ఆప్యాయతానురాగాల మధ్య, ఆనందంగా ఆహ్లాదంగా సాగాల్సిన పిల్లల జీవితాలు మోడుబారి మొగ్గలోనే వాడిపోతున్నాయి.
మరి ముందుకు ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి…? అని చూసిన నాకు కొన్ని అనుభవాలు జ్ఞప్తికి వచ్చాయి. మరి కొన్ని సంఘటనలు కళ్లముందు కనబడ్డాయి.
ఈ నా భావాలను అందరితో పంచుకుంటూ, మన బాల్యాన్ని పునరావృతి చేసుకోవాలని, ఇప్పటి పిల్లలు కోల్పోతున్న ఆనందాలు ఏంటో పిల్లలకు మాత్రమే కాక వారి తల్లితండ్రులకు కూడా తెలియచెప్పాలని ఈ వచన కవితలను నాకున్న భాషా పరిమితిలో చేర్చి కూర్చాను. ఈ నా వల్లికలు మీ బాల్యాన్ని ఒకసారి మననం చేసుకోవడంలో దోహదపడగలవని ఆశిస్తూ మీ ముందుంచుతున్నాను.
అమ్మ గర్భంలోని శిశువు పొందే అనుభూతుల నుండి, మధుర మనోహర బాల్య దశ నుండి, మారిన పిల్లల మనోభావాల నుండి, ప్రవర్తనల నుండి, పెరిగి పెద్దయిన పిల్లల పరివర్తన దాకా ఈ వచన కవితా ప్రయాణం సాగుతుంది.
గిరిధర్ ఆళ్వార్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తిరుపతి నగరంలో జన్మించారు. వీరు MBA డిగ్రీ పూర్తిచేసి సాఫ్ట్వేర్ వృత్తిరీత్యా చెన్నైలో నివసిస్తున్నారు.
My Quest for Happy Life పేరిట వీరు ఆంగ్ల నవలను నోషన్ ప్రెస్ వారి గుండా 2015 లోప్రచురించారు. ఈ నవల అన్ని ఆన్లైన్ మధ్యమాలలో అందుబాటులో ఉంది.
బాల వికాసం అను ఈ వచన కవితా కదంబం వారి రెండవ పుస్తకం, తెలుగులో వారు రాసిన మొదటి పుస్తకం.
ఐ టి రంగంలో ఉన్నప్పటికీ వారి ఆసక్తిని, చిత్రకళ పై మక్కువను చంపుకోలేక ఖాళీ సమయాలలో కుంచెతో బొమ్మలు వేయడం వారి అభిరుచి. కళను జీవితంలో ఒక భాగంగా కాక కళనే జీవితంగా వారు నమ్ముతారు.
ఈ ‘బాల వికాసం’ అమ్మ గర్భంలోని శిశువు పొందే అనుభూతుల నుండి, మధుర మనోహర బాల్య దశ నుండి, మారిన పిల్లల మనోభావాల నుండి, ప్రవర్తనల నుండి, పెరిగి పెద్దయిన పిల్లల పరివర్తన దాకా ఈ వచన కవితా ప్రయాణం సాగుతుంది.