డాక్టర్. అరవింద్ యాదవ్
డాక్టర్ అరవింద్ యాదవ్...జర్నలిస్టుగా ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆయనది. పాత్రికేయుడిగా ఆయన ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన తన అనుభవాలన్నింటినీ రంగరించి అద్భుతమైన రచనలు, ప్రసంగాలుగా మలిచారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయం, అవినీతి, దౌర్జన్యం, బానిసత్వానికి వ్యతిరేకంగా ఆయన తన రచనల ద్వారా పోరాటం సాగిస్తున్నారు. తన కలాన్ని సమాజంలో “అణగారిన వర్గాల గొంతుగా” వినిపిస్తున్నారు. ఇదే జర్నలిజం ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. కొన్నేళ్ళుగా సమాజంలో నిర్మాణాత్మకైనా మార్పు కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ఈ సమాజపు విజేతల గురించి, వారు చేసిన విశేష కృషి గురించి రాయడం, వాటిని డాక్యుమెంట్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు అరవింద్ యాదవ్.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డాక్టర్ యాదవ్ విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. ఆయన సైన్స్, సైకాలజీ, న్యాయ శాస్త్రాలను అభ్యసించారు. దక్షిణాది రాజకీయాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉంది. వార్తలు, ప్రత్యేక కథనాల సేకరించే పనిలో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక మారుమూల గ్రామాలు సందర్శించి అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు ప్రపంచానికి తెలియజేసారు. ఆయన అన్వేషణ, విస్తృత ప్రయాణాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కథా రచయితగా, జీవిత చరిత్ర రచయితగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. సమాజ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ఎంతో మంది విజేతల విజయ రహస్యాలను, వారి జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించి, లక్ష్యసాధన దిశగా ప్రజలను చైతన్య పరచడమే తన ప్రధమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు డాక్టర్ అరవింద్ యాదవ్.
అరవింద్ యాదవ్ భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన విశిష్టమైన పలువురి జీవితాలను డాక్యుమెంట్ చేశారు. 'భారతరత్న' డాక్టర్ సిఎన్ఆర్ రావు, భారతదేశపు మొట్ట మొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, సామాజిక కార్యకర్త పూల్బాసన్ యాదవ్ తోపాటు ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలను మనకు అందించారు. డా. యాదవ్ గారు ఇప్పటి వరకు 20 పుస్తకాలు, అనేక వ్యాసాలు రాశారు.
జర్నలిస్టుగా 1999 నుండి 2019 వరకు డాక్టర్ యాదవ్ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కవర్ చేశారు. ఆజ్ తక్ /హెడ్లైన్స్ టుడే, IBN 7, TV9 న్యూస్ నెట్వర్క్ వంటి ప్రముఖ సంస్థలలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. భారతదేశపు మొదటి HD న్యూస్ ఛానెల్ - సాక్షి టీవీని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యువర్ స్టోరీ వెబ్ సైట్లో భారతీయ భాషలన్నింటికీ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేశారు
ఎంతో మంది జర్నలిజం రంగంలోకి ప్రవేశిస్తారు. కానీ డాక్టర్ అరవింద్ యాదవ్ వంటి వారు మాత్రమే తమ విశిష్ట కృషితో ఆ రంగానికి వన్నె తెస్తారు. సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమై ఉండటమే కాకుండా సామాజిక న్యాయం, పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన అహర్నిశలూ పోరాడుతూనే ఉన్నారు.
అరవింద్ యాదవ్ ఒక సాహితీవేత్త కూడా. హిందీ సాహిత్య విమర్శలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. "నిర్మాణాత్మకమైన విమర్శ" ఆయన సహజ లక్షణం. ఆయన విమర్శించే తీరు సమాజం తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. హిందీ విమర్శ మౌఖిక సంప్రదాయాన్ని ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తునారు.
క్షణం కూడా తీరిక ఉండని జర్నలిజం, మీడియా రంగాలలో ఉంటూనే తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రపీని, పర్యటనలను కొనసాగిస్తూనే ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా కొండకోనలు, అడవుల్లో సంచరిస్తూ తన కెమెరాతో “క్లిక్” మనిపిస్తారు. దేశమంతా “చక్కర్లు” కొడతారు. ఆయన జీవితం అనేక అనుభవాల సంపుటి.